దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన ఐదుగురుతో పాటు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు.
సుశాంత్ బంధువు ఓం ప్రకాశ్ సింగ్ సోదరి అంత్యక్రియలకు హాజరైన అనంతరం పాట్నా నుంచి జమూయి పట్టణానికి తిరిగి వస్తుండగా లఖిసరాయ్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న టాటా సుమో సుమోలో మొత్తం 10 మంది ఉన్నారు. వారిలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారంతా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బావ, హర్యానా కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ ఓం ప్రకాశ్ సింగ్ సమీప బంధువు.
మీడియా కథనాల ప్రకారం నేషనల్ హైవే 333పై సికింద్ర-షేక్‌పుర మధ్య పిప్రా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఖాళీ ఎల్‌పీజీ సిలిండర్స్ లోడ్‌తో వస్తోన్న ట్రక్‌ను ఢీకొట్టడంతో డ్రైవర్ సహా ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలపాలైన నలుగురిని జమూయిలోని సదర్ హాస్పిటల్‌కు తరలించారు.
ప్రమాదంలో మరణించిన వారిని లలిత్ సింగ్, ఆయన ఇద్దరు కుమారులు అమిత్ శేఖర్, రామ్ చంద్ర సింగ్, కుమార్తె బేబీ దేవి, మేనకోడలు అనితా దేవి, డ్రైవర్ ప్రీతమ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. లలిత్ సింగ్... హర్యానాలో సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ఓం ప్రకాస్ సింగ్ బావమరిది. ఓం ప్రకాష్ సింగ్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బావ, ఓం ప్రకాష్ సింగ్ సోదరి గీతా దేవి అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు లోకల్ మీడియా సమాచారం.